నా గురించి....
నమస్కారం!
"మానవ సేవే మాధవ సేవ" అన్న సూక్తిని నమ్ముతూ, అక్షరాల ద్వారా విజ్ఞానాన్ని, ఆచరణ ద్వారా సహాయాన్ని అందించే చిరు ప్రయత్నమే నా ఈ ప్రస్థానం.
నా మూలాలు - విద్యా ప్రయాణం పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా, ధర్మపురి నా జన్మభూమి. కీ.శే. వెంకటలక్ష్మి, అంజయ్య గార్లు నా తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండే చదువుపై ఉన్న మక్కువ నన్ను ఉన్నత విద్య వైపు నడిపించింది. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ (బి.ఏ)లో అత్యుత్తమ మార్కులతో "గోల్డ్ మెడల్" సాధించడం నా విద్యార్థి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం.
భాషపై మమకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు ఆంగ్ల సాహిత్యాలలో ఎం.ఏ (M.A.) పూర్తి చేశాను. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు భాషను సాంకేతికతకు జోడిస్తూ... "అంతర్జాలంలో తెలుగు భాషాసాహిత్యాలు - అధ్యయనం" అనే అంశంపై ఆచార్య సాగి కమలాకర శర్మ గారి మార్గదర్శకత్వంలో పరిశోధన చేసి ఉస్మానియా నుండి పిహెచ్.డి (Ph.D) పట్టా పొందాను. ఈ పుస్తకాన్ని ప్రతిష్ఠాత్మక "తెలంగాణ సాహిత్య అకాడమీ" వారు ముద్రించడం, అనేక విశ్వవిద్యాలయాలు, అటానమస్ కళాశాలల్లో ఇందులోని అంశాలు బోధనాంశాలుగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చే అంశం.
వృత్తి - ప్రవృత్తి ఉపాధ్యాయ వృత్తిని నేను కేవలం ఒక ఉద్యోగంగా కాక, ఒక బాధ్యతగా స్వీకరించాను. గత దశాబ్ద కాలానికి పైగా (2009 నుండి) విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల, తాళ్ళధర్మారంలో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది, ఉపనియామకం ద్వారా ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా పనిచేస్తున్నాను. నా వృత్తి ధర్మానికి గుర్తింపుగా 2025 సంవత్సరానికి "తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం", 2020లో "జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారం అందుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.
మరోవైపు, అంతర్జాలంలో తెలుగు భాషా వ్యాప్తి కోసం వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు చేయడం, బ్లాగులు, ఈ-మ్యాగజైన్ల ద్వారా రచనలు చేయడం నా ప్రవృత్తి.
సేవామార్గం: ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు... అనేకమంది పేద విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను గమనించేవాడిని. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ఆలోచన నుండే 2016లో "విద్యార్థి దత్తత కార్యక్రమం" (Student Adoption Program) పుట్టింది. నా మిత్రులు, దాతల సహకారంతో ఇప్పటివరకు సుమారు 4000 మందికి పైగా నిరుపేద విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, ఇతర విద్యా సామాగ్రిని (Education Kits) అందించగలిగాము. సుమారు 15 మంది విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాము.
అలాగే, 2011లో చిన్ననాటి మిత్రులందరం కలిసి ఏర్పాటు చేసిన "We Help You" (WHY) ఛారిటీ సంస్థ ద్వారా కరోనా సమయంలో సామాగ్రి, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ వంటివి అందించడం, వరద బాధితులకు సాయం, వైద్య శిబిరాలు, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాము
సాహిత్యం, సాంకేతికత, సేవా కార్యక్రమాల సమాహారమే ఈ వెబ్‌సైట్. దీని ద్వారా నా ఆలోచనలను, పరిశోధనలను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది.
- డా।। గొల్లపెల్లి గణేశ్ (ఎం.ఏ., పిహెచ్.డి)


























ఇమెయిల్
contact@telanganabadi.in
9440227064
© 2025. All rights reserved.
ఫోన్:
